Friday, February 5, 2010

ప్రకటన 10, 11

Revelation  10 

ప్రకటన 10

The Angel and the Little Scroll
"The Angel and the Little Scroll" Brian J. Turner Copyright Brian J. Turner 2009. All Rights Reserved.
Related Bible Pictures

1 శక్తివంతుడైన మరొక దేవదూత పరలోకం నుండి క్రిందికి రావటం చూశాను. ఆయన మేఘాన్ని ఒక వస్త్రంగా ధరించి ఉన్నాడు. ఆయన తలపై మేఘధనుస్సు ఉంది. ఆయన ముఖం సూర్యునిలా ఉంది. ఆయన కాళ్ళు మండుతున్న స్తంభాల్లా ఉన్నాయి.
2 ఆయన చేతిలో ఒక చిన్న గ్రంథం ఉంది. అది తెరువబడి ఉంది. ఆయన తన కుడి కాలు సముద్రం మీద ఎడమకాలు భూమ్మీద ఉంచి బిగ్గరగా అరిచాడు.
3 ఆ అరుపు సింహ ఘర్జనలా ఉంది. ఆయనలా అరచినప్పుడు ఏడు ఉరుములు మాట్లాడాయి.
4 ఏడు ఉరుములు మాట్లాడిన వాటిని నేను వ్రాయటం మొదలుపెట్టాను. కాని పరలోకం నుండి ఒక స్వరం నాతో, “ఏడు ఉరుములు అన్న మాటల్ని దాచి ముద్ర వేయి, వాటిని వ్రాయవద్దు” అని అన్నది.
5 సముద్రం మీద, భూమ్మీద నిలబడి ఉన్న దూత నేను చూస్తుండగా తన కుడి చేతిని పరలోకం వైపుకు చాపాడు.
6 చిరకాలం జీవించే వాని మీద, పరలోకం అందులో ఉన్న వాటిని సృష్టించిన వాని మీద, భూమిని అందులో ఉన్న వాటన్నిటినీ సృష్టంచిన వాని మీద, సముద్రాన్ని అందులోవున్న వాటన్నిటినీ సృష్టించిన వాని మీద ప్రమాణం చేసి ఈ విధంగా అన్నాడు: “ఇక ఆలస్యం ఉండదు.
7 కాని ఏడవ దూత తన బూర ఊదటం మొదలు పెట్టే రోజులు వచ్చినప్పుడు దేవుని రహస్య ప్రణాళిక సమాప్తమౌతుంది. దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు ఈ రహస్యాన్ని ముందే చెప్పాడు.” అని అన్నాడు.
8 నేను పరలోకం నుండి విన్న స్వరం మళ్ళీ నాతో, “వెళ్ళు. సముద్రం మీదా, భూమ్మీదా, నిలబడి ఉన్న దూత చేతిలో తెరువబడివున్న గ్రంథాన్ని తీసుకో!” అని అన్నది.
9 అందువల్ల, నేను దేవదూత దగ్గరకు వెళ్ళి, ఆ చిన్న గ్రంథాన్నివ్వమని అడిగాను. ఆయన నాతో, ‘ఇది తీసుకొని తిను. అది నీ కడుపుకు చేదు కలిగిస్తుంది. కాని నీ నోటికి తేనెలా మధురంగా ఉంటుంది” అని అన్నాడు.
10 నేనా చిన్న గ్రంథాన్ని, దూత చేతినుండి తీసుకొని తినివేసాను. అది నా నోటికి తేనెలా మధురంగా ఉండెను. కాని అది తిన్నాక నా కడుపుకు చేదుగానుండెను.
11 ఆ తర్వాత ఆ దూత నాతో, “నీవు చాలా మంది ప్రజల్ని గురించి, దేశాల్ని గురించి, రాజుల్ని గురించి మళ్ళీ ప్రవచనం చెప్పాలి” అని అన్నాడు.





Revelation  11 

ప్రకటన 11

The Temple of God
"The Temple of God"
Related Bible Pictures

1 ఒక దేవదూత ఒక కొలత బద్ద లాంటిది నాకిచ్చి ఈ విధంగా అన్నాడు: వెళ్ళు, దేవుని మందిరాన్ని, బలిపీఠాన్ని కొలత వేయి. ఎంతమంది ప్రజలు ఆరాధిస్తున్నారో కూడ లెక్కపెట్టు.
2 కాని వెలుపలి ఆవర్ణం, యూదులుకాని వాళ్ళకివ్వబడింది. కనుక దాన్ని కొలత వేయకుండా వదిలేయి. వాళ్ళు నలభైరెండు నెలలు దాకా ఈ పవిత్ర నగరాన్ని త్రొక్కుతూ నడుస్తారు.
3 నేను నా యిరువురి సాక్షులకు శక్తినిస్తాను. వాళ్ళు గోనె పట్ట కట్టుకొని పన్నెండువందల అరువది దినాల దాకా దైవ సందేశం చెబుతారు.
4 రెండు ఒలీవ వృక్షాలు, రెండు దీపస్తంభాలు ఆ సాక్షులు. ఇవి ఈ భూమిని పాలించే దేవుని సమక్షంలో ఉన్నాయి.
5 వారికి హాని కలిగించాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళ నోళ్ళనుండి మంటలు వచ్చి, తమ శత్రువుల్ని మ్రింగివేస్తాయి. వారికి హాని తలపెట్టిన వాళ్ళు ఈ విధంగా మరణిస్తారు.
6 తాము దేవుని సందేశం బోధించే కాలంలో వర్షం కురియకుండా చేయటానికి వాళ్ళు ఆకాశాన్ని మూసి వేస్తారు. వాళ్ళకా శక్తి ఉంది. అంతేకాక, నీళ్ళను రక్తంగా మార్చగల శక్తి కూడా వాళ్ళకు ఉంది. రకరకాల తెగుళ్ళను తమకు యిష్టం వచ్చినప్పుడు ప్రపంచంలో వ్యాపింప చేయగల శక్తి కూడా వాళ్ళకు ఉంది.
7 వాళ్ళు తమ సందేశం చెప్పటం ముగించాక, మృగం పాతాళంనుండి మీదికి వచ్చి, వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళను ఓడించి చంపి వేస్తుంది.
8 వాళ్ళ దేహాలు మహానగరపు వీధుల్లో పడి ఉంటాయి. ఈ మహానగరం సొదొమతో, ఈజిప్టుతో పోల్చబడింది. ఇక్కడ ప్రభువు సిలువకు వేయబడ్డాడు.
9 మూడున్నర రోజులు ప్రతీ దేశానికి, ప్రతీ జాతికి, ప్రతీ భాషకు, ప్రతీ గుంపుకు చెందిన ప్రజలు, ఆ శవాలను చూస్తారు. వాళ్ళు వాటిని సమాధి చేయటానికి నిరాకరిస్తారు.
10 ఈ యిరువురు ప్రవక్తలు భూమ్మీద నివసిస్తున్న వాళ్ళకు కష్టాలు కలిగించారు. కనుక ప్రజలు ఆ ప్రవక్తలు మరణించటం చూసి ఆనందించారు. పరస్పరం కానుకలు పంపుకున్నారు. వేడుకలు చేసుకొన్నారు.
11 కాని మూడున్నర రోజుల తర్వాత దేవుడు ప్రవక్తల్లో మళ్ళీ ప్రాణం పోశాడు. వాళ్ళు లేచి నిలుచున్నారు. వీళ్ళను చూసిన ప్రజలు చాలా భయపడిపోయారు.
12 అప్పుడు పరలోకంనుండి ఒక స్వరం బిగ్గరగా, ‘మీదికి రండి’ అని అనటం వాళ్ళు విన్నారు. శత్రువులు చూస్తుండగా, వాళ్ళు ఒక మేఘం మీద పరలోకానికి వెళ్ళిపోయారు.
13 అదే క్షణంలో ఒక పెద్ద భూకంపం వచ్చింది. పట్టణంలో పదవ భాగం నాశనమైపోయింది. భూకంపంవల్ల సుమారు ఏడువేల మంది మరణించారు. బ్రతికున్న వాళ్ళు చాలా భయపడిపోయి పరలోకంలో ఉన్న దేవుణ్ణి స్తుతించారు.
14 రెండవ శ్రమ ముగిసింది. మూడవ శ్రమ త్వరలో జరుగనుంది.
15 ఏడవ దేవదూత తన బూర ఊదాడు. పరలోకం నుండి అనేక స్వరాలు యిలా బిగ్గరగా అనటం వినిపించింది: “ప్రపంచం మన ప్రభువు రాజ్యంగా మారింది. ఆయన క్రీస్తు రాజ్యంగా మారింది. ఆయన చిరకాలం రాజ్యం చేస్తాడు.”
16 దేవుని సమక్షంలో సింహాసనాలపై కూర్చొన్న యిరువది నాలుగుమంది పెద్దలు సాష్టాంగపడ్డారు.
17 వాళ్ళు దేవుణ్ణి పూజిస్తూ ఈ విధంగా అన్నారు: “ప్రభూ! సర్వ శక్తివంతుడవైన దైవమా! నీవు ప్రస్తుతం ఉన్నావు. గతంలో ఉన్నావు. నీ గొప్పశక్తిని ఉపయోగించి మళ్ళీ పాలించటం మొదలుపెట్టావు. కనుక నీకు మా కృతజ్ఞతలు!
18 దేశాలు ఆగ్రహం చెందాయి. ఇప్పుడు నీకు ఆగ్రహం వచ్చింది. చనిపోయిన వాళ్ళపై తీర్పు చెప్పే సమయం వచ్చింది. నీ సేవకులైన ప్రవక్తలకు ప్రతిఫలం యిచ్చే సమయం వచ్చింది. నీ పవిత్రులకు, నీ నామాన్ని గౌరవించే వాళ్ళకు, సామాన్యులకు పెద్దలకు, అందరికి ప్రతిఫలం యిచ్చే కాలం వచ్చింది. భూమిని నాశనం చేసే వాళ్ళను నాశనం చేసే కాలం వచ్చింది.”
19 అప్పుడు పరలోకంలో ఉన్న దేవుని మందిరం తెరువబడింది. ఆ మందిరంలో ఉన్న ఆయన పరిశుద్ధమైన ఒడంబడిక మందసం కనిపించింది. అప్పుడు మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపము, పెద్ద వడగండ్ల వాన వచ్చాయి.


Tags: Telugu-bible bible, bible prakatana, telugu bible prakatana, Revelation 10, dvr , jhon, john, telugu bible prakatana10 -11, ptakatana ప్రకటన 10 ప్రకటన, telugu bible ప్రకటన , free jesus song, Telugu-bible bible, bible prakatana, telugu bible prakatana, Revelation 10, dvr , jhon, john, telugu bible prakatana10 -11, ptakatana ప్రకటన 10 ప్రకటన, telugu bible ప్రకటన , free jesus songs



Choose a Bible Book or Range
Type your text here
Ignore Case
Highlight Results