Thursday, February 4, 2010

ప్రకటన 12 ,13 , 14

Revelation  12






ప్రకటన 12
 

Archangel Michael
"Archangel Michael" Guido Reni 1630
Related Bible Pictures

1 పరలోకంలో ఒక గొప్ప అద్భుతమైన దృశ్యం కనిపించింది. సూర్యుణ్ణి తన వస్త్రంగా, చంద్రుణ్ణి తన పాదాల క్రింద, పన్నెండు నక్షత్రాల కిరీటాన్ని తలపై పెట్టుకొన్న ఒక స్త్రీ కనిపించింది.
2 ఆమె గర్భంతో ఉంది. ప్రసవించే సమయం రావటంవల్ల ఆమె నొప్పులతో బిగ్గరగా కేక వేసింది.
3 అప్పుడు పరలోకంలో ఇంకొక దృశ్యం కనిపించింది. ఒక పెద్ద ఘటసర్పం, ఏడు తలలతో, పది కొమ్ములతో కనిపించింది. అది ఎర్రగా ఉంది. ఆ ఏడు తలలమీద ఏడు కిరీటాలు ఉన్నాయి.
4 ఆ ఘటసర్పం తన తోకతో ఆకాశం నుండి నక్షత్రాలలో మూడవభాగాన్ని ఊడ్చి, వాటిని భూమ్మీదికి పారవేసింది. ఆ స్త్రీ ప్రసవించిన వెంటనే ఆ శిశువును మ్రింగి వేద్దామని, ఆ ఘటసర్పం ప్రసవించబోయే ఆ స్త్రీ ముందు నిలబడివుంది.
5 ఆమె ఒక మగ శిశువును ప్రసవించింది. ఆ బాలుడు దేశాలను గొప్ప అధికారంతో పాలిస్తాడు. ఆ శిశువును ఎవరో ఎత్తుకొని దేవుని సింహాసనం దగ్గరకు తీసుకు వెళ్ళారు.
6 ఆ స్త్రీ ఎడారి ప్రాంతానికి పారిపోయింది. ఆమెను పన్నెండువందల అరువది రోజుల దాకా జాగ్రత్తగా చూసుకోవటానికి దేవుడు ఒక స్థలం ఏర్పాటు చేశాడు.
7 పరలోకంలో ఒక యుద్ధం జరిగింది. మిఖాయేలు, అతని దూతలు, ఘటసర్పంతో యుద్ధం చేసారు. ఘటసర్పం తన దూతలతో తిరిగి యుద్ధం చేసింది.
8 ఆ ఘటసర్పానికి తగినంత శక్తి ఉండనందువల్ల ఓడిపోయి పరలోకంలో వాటి స్థానాన్ని పోగొట్టుకొన్నాయి.
9 వాళ్ళు ఆ ఘటసర్పాన్ని భూమ్మీదికి త్రోసి వేశారు. ఇది ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే ఆది సర్పం. చాలాకాలం నుండి ఉన్న ఈ ఘటసర్పానికి దయ్యమని, సైతాను అని పేరు . ఆ ఘటసర్పాన్ని, దాని దూతల్ని వాళ్ళు క్రిందికి త్రోసివేశారు.
10 పరలోకం నుండి ఒక పెద్ద స్వరం బిగ్గరగా యిలా అనటం విన్నాను: ‘మనదేవుని ముందు మన సోదరుల్ని రాత్రింబగళ్ళు నిందించే వాడు క్రిందికి త్రోసివేయబడ్డాడు. అందుకే మన దేవుని రాజ్యం వచ్చింది. రక్షణ శక్తి లభించింది. ఆయన క్రీస్తుకు అధికారం వచ్చింది.
11 గొఱ్ఱెపిల్ల రక్తంతో, తాము బోధించిన సత్యంతో మన సోదరులు వాణ్ణి ఓడించారు. వాళ్ళు తమ జీవితాల్ని, చావుకు భయపడేటంతగా ప్రేమించ లేదు.
12 కనుక పరలోకమా! ఆనందించు. పరలోకంలో ఉన్న ప్రజలారా! ఆనందించండి. ప్రపంచమా! నీలో సైతాను ప్రవేశించాడు కనుక నీకు శాపం కలుగుతుంది! సముద్రమా! నీకు శాపం కలుగుతుంది! సైతానుకు తన కాలం తీరిందని తెలుసు. కనుక వాడు చాలా కోపంతో ఉన్నాడు.”
13 ఘటసర్పం తాను భూమ్మీదకు విసిరివేయబడటం గమనించి మగ శిశువును ప్రసవించిన స్త్రీని వెంటాడింది.
14 ఆమెకోసం ఎడారి ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన స్థలానికి ఆమె ఎగిరి పోవటానికి, దేవుడు ఆమెకు రెండు పక్షిరాజు రెక్కల్ని యిచ్చాడు. అక్కడ ఆ ఘటసర్పానికి దూరంగా ఆమె మూడున్నర సంవత్సరాలు జాగ్రత్తగా పోషించబడుతుంది.
15 ఆ సర్పం తన నోటినుండి నీళ్ళను వదిలింది. ఆ నీళ్ళు ఒక నదిలా ప్రవహించాయి. ఆ నీళ్ళు ఆమెను కొట్టుకు పోయేటట్లు చేయాలని ఆ ఘటసర్పం ప్రయత్నించింది.
16 కాని భూమి తన నోరు తెరిచి ఘటసర్పం కక్కిన నీటిని త్రాగి ఆ స్త్రీని రక్షించింది.
17 ఆ స్త్రీని చూసి ఘటసర్పానికి చాలా కోపం వచ్చింది. అది ఆమె యొక్క మిగతా సంతానంతో యుద్ధం చేయాలని వెళ్ళింది. దేవుని ఆజ్ఞలను పాటిస్తూ యేసును గురించి సాక్ష్యం చెప్పింది ఈమె మిగతా సంతానమే.
18 వారితో యుద్ధం చేయుటకై ఆ ఘట సర్పం సముద్రతీరం దగ్గర నిలబడి ఉంది.







Related Bible Pictures

 

Revelation  13







ప్రకటన 13

 

1 సముద్రం నుండి ఒక మృగం రావటం నేను చూసాను. దానికి పది కొమ్ములు, ఏడు తలలు ఉన్నాయి. ఆ పది కొమ్ములమీద పది కిరీటాలు ఉన్నాయి. ప్రతి తలపై ఒక దేవ దూషణ పేరు వ్రాయబడి ఉంది.
2 నేను చూసిన ఆ మృగం ఒక చిరుత పులిలా ఉంది. కాని దాని కాళ్ళు ఎలుగుబంటి కాళ్ళలా ఉన్నాయి. దాని నోరు సింహం నోరులా ఉంది. ఆ ఘటసర్పం ఆ మృగానికి తన శక్తిని, తన సింహాసనాన్ని, గొప్ప అధికారాన్ని యిచ్చింది.
3 ఆ మృగానికి ఉన్న తలల్లో ఒక తలకు ప్రమాదకరమైన గాయం ఉన్నట్లు కనిపించింది. కాని ఆ ప్రమాదకరమైన గాయం మానిపోయింది. ప్రపంచమంతా ఆశ్చర్యపడి ఆ మృగాన్ని అనుసరించింది.
4 ఘటసర్పం ఆ మృగానికి అధికారమిచ్చినందువల్ల మానవులు ఆ ఘటసర్పాన్ని పూజించారు. వాళ్ళు మృగాన్ని కూడా పూజిస్తూ, “మృగం వలె ఎవరున్నారు? మృగంతో ఎవరు యుద్ధం చేయగలరు?” అని అన్నారు.
5 గర్వంగా మాట్లాడటానికి, దైవ దూషణ చేయటానికి, తన అధికారాన్ని నలుబది రెండు నెలలు చెలాయించడానికి ఆ మృగానికి నోరు యివ్వబడింది.
6 ఆ మృగం తన నోరు తెరచి దేవుణ్ణి దూషించింది. ఆయన నామాన్ని, ఆయన నివసించే స్థానాన్ని, పరలోకంలో నివసించే వాళ్ళను దూషణ చేసింది.
7 భక్తులతో యుద్ధం చేసి జయించటానికి దానికి శక్తి యివ్వబడింది. అంతేకాక, అన్ని జాతుల మీద, అన్ని గుంపుల మీద, అన్ని భాషల మీద, అన్ని దేశాల మీద ఆ మృగానికి అధికారమివ్వబడింది.
8 ఈ భూమ్మీద నివసించే వాళ్ళంతా, అంటే ప్రపంచం సృష్టింపబడిన నాటినుండి ఎవరి పేర్లు వధింపబడిన గొఱ్ఱెపిల్ల జీవ గ్రంథంలో వ్రాయబడలేదో, వాళ్ళు ఈ మృగాన్ని పూజిస్తారు.
9 చెవులున్న వాళ్ళు వినండి:
10 బంధింపబడవలసిన వాడు బంధింపబడతాడు. కత్తితో వధింపబడవలసిన వాడు వధింపబడతాడు. కనుక భక్తుల్లో శాంతము, విశ్వాసము ఉండాల్సి వస్తుంది.
11 తదుపరి మరొక మృగం భూమిలోపలి నుండి రావటం చూసాను. ఆ మృగానికి గొఱ్ఱెకు ఉన్నట్లు రెండు కొమ్ములు ఉన్నాయి. కాని అది ఘటసర్పం మాట్లాడినట్లు మాట్లాడింది.
12 అది ప్రమాదకరమైన గాయం నయమైన మొదటి మృగం పక్షాన, దాని అధికారమంతా ఉపయోగించి భూమిని, దానిపై నివసించే వాళ్ళను, మొదటి మృగాన్ని పూజించేటట్లు చేసింది.
13 అది అద్భుతమైన సూచనలు చూపింది. ప్రజలు చూస్తుండగా ఆకాశం నుండి మంటల్ని కూడా భూమ్మీదికి రప్పించింది.
14 మొదటి మృగం పక్షాన సూచనలు చూపటానికి దానికి అధికారమివ్వబడింది. ఈ అధికారంతో అది భూమ్మీద నివసించే వాళ్ళను మోసం చేస్తోంది. కత్తితో గాయపడి కూడా జీవించిన మృగానికి గౌరవార్థంగా ఒక విగ్రహాన్ని స్థాపించమని ప్రజల్ని ఆజ్ఞాపించింది.
15 మొదటి మృగం యొక్క విగ్రహానికి ప్రాణం పోసే శక్తి యివ్వబడింది. ఆ విగ్రహం మాట్లాడి, తనను పూజించటానికి నిరాకరించిన వాళ్ళను చంపేటట్లు చేసింది.
16 అంతేకాక చిన్నా, పెద్దా, ధనికుడూ, పేదవాడు, బానిస, స్వతంత్రుడు అనే బేధం లేకుండా ప్రతి ఒక్కడూ తన కుడి చేతి మీదగాని, నుదుటిమీదగాని, ఒక ముద్ర వేసుకోవాలని నిర్భంధం చేసింది.
17 ఈ ముద్ర లేకుండా ఎవ్వరూ అమ్మటం కాని, కొనటం కాని, చేయరాదని యిలా చేసింది. ఈ ముద్రలలో ఆ మృగం పేరు, లేక వాని పేరు సంఖ్య వ్రాయబడి ఉంది.
18 ఇక్కడే తెలివి కావాలి. ఆ పరిజ్ఞానం ఉన్నవాడు ఆ మృగం యొక్క సంఖ్య ఏదో చెప్పనీ! ఎందుకంటే అది ఒక మనుష్యుని సంఖ్య. వాని సంఖ్య ఆరువందల అరువదియారు.


Revelation  14







ప్రకటన 14
 

1 అప్పుడు నేను చూశాను. నా ముందు ఆ గొఱ్ఱెపిల్ల కనబడినాడు. ఆయన సీయోను పర్వతంపై నిలబడి ఉన్నాడు. ఆయనతో ఒక లక్షా నలుబది నాలుగు వేల మంది ఉన్నారు. వాళ్ళ నొసళ్ళపై ఆయన పేరు, ఆయన తండ్రి పేరు వ్రాయబడి ఉంది.
2 పరలోకం నుండి నాకొక శబ్దం వినిపించింది. ఆయన ధ్వని జలపాతపు ధ్వనిలా, పెద్ద ఉరుము ధ్వనిలా ఉంది. నేను విన్న ఆ ధ్వని వీణను మీటినప్పుడు కలిగే ధ్వనిలా ఉంది.
3 వాళ్ళు సింహాసనం ముందు, ఆ నాలుగు ప్రాణుల ముందు, పెద్దల ముందు నిలబడి ఒక క్రొత్త పాట పాడారు. భూలోకం నుండి విమోచించబడ్డ ఒక లక్షా నలువది నాలుగు వేల మంది తప్ప యితరులు ఆ పాట నేర్చకోలేక పోయారు.
4 వీళ్ళు స్త్రీ సంపర్కంతో మలినం కాకుండా పవిత్రంగా ఉన్నవాళ్ళు. వీళ్ళు గొఱ్ఱెపిల్ల ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని అనుసరిర చే వాళ్ళు. వీళ్ళు మానవులనుండి కొనుక్కోబడి ప్రథమ ఫలంగా దేవునికి, గొఱ్ఱెపిల్లకు ప్రత్యేకింపబడినవాళ్ళు.
5 వీళ్ళ మాటల్లో అసత్యం లేదు. వీళ్ళు నిర్దోషులు.
6 ఆ తర్వాత మరొక దూత మధ్యాకాశంలో ఎగరటం చూసాను. ప్రపంచంలో నివసించే ప్రజలందరికీ, అంటే ప్రతీ దేశానికి, ప్రతీ జాతికి, ప్రతీ భాషకు ప్రతీ గుంపుకు చెందిన ప్రజలకు ప్రకటించటానికి అతని దగ్గర “అనంత జీవితాన్ని” గురించిన సువార్త ఉంది.
7 అతడు బిగ్గరగా, “దేవునికి భయపడండి. ఆయన మహిమను స్తుతించండి. ఆయన తీర్పు చెప్పే గడియ దగ్గరకు వచ్చింది. ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నీటి ఊటలను సృష్టించిన వాణ్ణి పూజించండి” అని అన్నాడు.
8 రెండవ దూత మొదటి దూతను అనుసరిస్తూ, “బాబిలోను పతనమైపోయింది. బాబిలోను మహానగరం పతనమైపోయింది. ‘వ్యభిచారం’ అనబడే మధ్యాన్ని దేశాలకు త్రాగించింది ఇదే” అని అన్నాడు.
9 మూడవ దూత మొదటి యిద్దరిని అనుసరిస్తూ బిగ్గరగా, “మృగాన్ని గాని, దాని విగ్రహాన్ని గాని పూజించి దాని ముద్రను నుదుటి మీద గాని, చేతిమీద కాని వేయించు కొన్నవాడు దేవుని కోపమనే మద్యాన్ని త్రాగక తప్పదు.
10 ఈ మద్యం దేవుని ఆగ్రహం అనబడే గిన్నెలో పూర్తి ఘాటుతో చేయబడింది. అంతేకాక పరిశుద్ధమైన దూతల ముందు, గొఱ్ఱెపిల్ల ముందు మండుతున్న గంధకంతో వానిని హింసిస్తారు.
11 వాళ్ళు కాలటంవల్ల రగులుతున్న పొగ చిరకాలం లేస్తూనే ఉంటుంది. మృగాన్ని గాని, దాని విగ్రహాన్ని గాని పూజించే వాళ్ళకు, లేక దాని పేరును ముద్రగా పొందిన వాళ్ళకు పగలు, రాత్రి విరామం ఉండదు” అని అన్నాడు.
12 అంటే దేవుని ఆజ్ఞలను పాటించే పవిత్రులు యేసుపట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు సహనంగా ఉండాలి.
13 ఆ తదుపరి పరలోకం నుండి ఒక స్వరం, “ఇది వ్రాయి. ఇప్పటి నుండి ప్రభువులో చనిపోయిన వాళ్ళు ధన్యులు” అని అన్నది. “అది నిజం. వాళ్ళకిక విశ్రాంతి ఉంటుంది. ఇది వరకు వాళ్ళు చేసిన మంచిపనులు వాళ్ళ వెంట ఉంటాయి” అని పరిశుద్ధాత్మ అన్నాడు.
14 ఒక తెల్లటి మేఘం నా ముందు కనిపించింది. దానిమీద “మనుష్య కుమారుని” లాంటివాడు కూర్చొనివుండటం చూశాను. ఆయన తలపై బంగారు కిరీటం ఉంది. ఆయన చేతిలో పదునైన కొడవలి ఉంది.
15 ఆ తర్వాత మందిరం నుండి మరొక దూత వచ్చాడు. అతడు బిగ్గరగా మేఘం మీద కూర్చొన్నవాణ్ణి పిలిచి, “భూమ్మీద పంట పండింది. పంటను కోసే సమయం వచ్చింది. నీ కొడవలి తీసుకొని పంటను కోయి!” అని అన్నాడు.
16 మేఘంమీద కూర్చొన్న వాడు తన కొడవలిని భూమ్మీదికి విసిరాడు. వెంటనే ఆ కొడవలి పంటను కోసింది.
17 పరలోకంలో ఉన్న మందిరం నుండి యింకొక దూత వచ్చాడు. అతని దగ్గర కూడా ఒక పదునైన కొడవలి ఉంది.
18 మరొక దూత బలిపీఠం నుండి వచ్చాడు. అగ్నికి అధికారియైన యితడు బిగ్గరగా పదునైన కొడవలి ఉన్నవాణ్ణి పిలుస్తూ, “ద్రాక్ష పండింది. నీ పదునైన కొడవలి తీసుకెళ్ళి భూమ్మీద వున్న ద్రాక్షా తోటనుండి ద్రాక్షాగుత్తుల్ని కోయి” అని అన్నాడు.
19 ఆ దూత కొడవలిని భూమ్మీదికి విసిరి ద్రాక్షా పండ్లు కోసి వాటిని దేవుని కోపం అనబడే పెద్ద తొట్టిలో వేసాడు.
20 ఊరికి అవతలవున్న ద్రాక్షా తొట్టిలో ద్రాక్షా పళ్ళను వేసి వాటిని త్రొక్కారు. దాన్నుండి రక్తం ప్రవహించింది. ఆ రక్తం గుఱ్ఱం నోటి కళ్ళెం అంత ఎత్తు లేచి, సుమారు రెండు వందల మైళ్ళ దూరందాకా ప్రవహించింది.

Tags:  telugu bible , bible  , prakatana  , bible telugu ,  Revelation    telugu bible , bible  , prakatana  , bible telugu ,  telugu bible , bible  , prakatana  , bible telugu ,  Revelation    telugu bible , bible  , cristian telugu bible

 

ప్రకటన 15 , 17

Revelation  15








ప్రకటన 15

 

1 నేను పరలోకంలో యింకొక అద్భుతమైన దృశ్యం చూశాను. ఏడుగురు దూతలు ఏడు చివరి తెగుళ్ళు పట్టుకొని ఉండటం చూశాను. వీటితో దేవుని కోపం సమాప్తమౌతుంది. కనుక యివి చివరివి.
2 నిప్పుతో కలిసిన గాజు సముద్రం లాంటి ఒక సముద్రం నాకు కనిపించింది. మృగాన్ని, దాని విగ్రహాన్ని జయించిన వాళ్ళు దాని నామానికున్న సంఖ్యను జయించిన వాళ్ళు సముద్రతీరం మీద నిలబడి ఉండటం చూసాను. వాళ్ళు తమ చేతుల్లో దేవుడుంచిన వీణల్ని పట్టుకొని ఉన్నారు.
3 దేవుని సేవకుడైన మోషే గీతాన్ని, గొఱ్ఱెపిల్ల గీతాన్ని వాళ్ళు ఈ విధంగా పాడుతూ ఉన్నారు: “ప్రభూ! సర్వశక్తి సంపన్నుడవైన దైవమా! నీ కార్యాలు గొప్పవి. అద్భుతమైనవి. యుగయుగాలకు రాజువు నీవు. నీ మార్గాలు సత్యసమ్మతమైనవి. న్యాయసమ్మతమైనవి.
4 ఓ ప్రభూ! నీకెవరు భయపడరు? నీ నామాన్ని స్తుతించనివారెవరున్నారు? నీ వొక్కడివే పరిశుద్ధుడవు. నీ నీతికార్యాలు ప్రత్యక్షమైనవి. కనుక ప్రజలందరూ వచ్చి నిన్ను ఆరాధిస్తారు.”
5 దీని తర్వాత పరలోకంలో ఉన్న మందిరాన్ని చూసాను. అంటే సాక్ష్యపు గుడారము తెరుచుకోవటం చూసాను.
6 ఆ మందిరం నుండి ఏడుగురు దేవదూతలు ఏడు తెగుళ్ళతో బయటకు వచ్చారు. వాళ్ళు తెల్లటి మెరిసే నార బట్టలు వేసుకొని ఉన్నారు. రొమ్ముల మీద బంగారు దట్టి కట్టుకొని ఉన్నారు.
7 ఆ తర్వాత ఆ నాలుగు ప్రాణుల్లో ఒకటి ఆ ఏడుగురి దూతలకు, చిరంజీవి అయిన దేవుని ఆగ్రహంతో నిండిన ఏడు బంగారు పాత్రల్ని యిచ్చింది.
8 ఆ మందిరమంతా దైవశక్తి వల్ల మరియు ఆయన తేజస్సు వల్ల కలిగిన పొగలతో నిండిపోయింది. ఏడుగురు దూతలు తెచ్చిన ఏడు తెగుళ్ళు పూర్తి అయ్యేవరకు ఆ మందిరంలో ఎవ్వరూ ప్రవేశించలేక పోయారు.

Revelation  16







ప్రకటన 16
 

1 మందిరం నుండి ఒక స్వరం బిగ్గరగా ఆ ఏడుగురు దూతలతో, “వెళ్ళండి, దేవుని కోపంతో నిండిపోయిన ఆ ఏడు పాత్రల్ని భూమ్మీద కుమ్మరించండి” అని నాకు వినిపించింది.
2 మొదటి దూత వెళ్ళి తన పాత్రను భూమ్మీద కుమ్మరించాడు. మృగం ముద్రవున్న వాళ్ళ దేహాల మీద, మృగం విగ్రహాన్ని పూజించిన వాళ్ళ దేహాలమీద, బాధ కలిగించే వికారమైన కురుపులు లేచాయి.
3 రెండవ దూత ెవెళ్ళి, తన పాత్రను సముద్రం మీద కుమ్మరించాడు. ఆ సముద్రం శవంలోని రక్తంలా మారిపోయింది. సముద్రంలో ఉన్న సమస్త జీవరాసులు మరణించాయి.
4 మూడవ దూత తన పాత్రను నదులమీద, నీటి ఊటలమీద కుమ్మరించాడు. వాటి నీళ్ళు రక్తంగా మారాయి.
5 నీటి మీద అధికారమున్న దూత ఈ విధంగా అనటం విన్నాను: “నీవు న్యాయంగా తీర్పు చెప్పావు. నీవు ప్రస్తుతం ఉన్నావు. గతంలో ఉండిన వాడవు. నీవు పవిత్రమైన వాడవు, ఎందుకంటే నీవు ఆ విధంగా తీర్పు తీర్చావు.
6 వాళ్ళు నీ భక్తుల రక్తాన్ని, నీ ప్రవక్తల రక్తాన్ని కార్చారు. దానికి తగిన విధంగా నీవు వాళ్ళకు త్రాగటానికి రక్తాన్నిచ్చావు.”
7 బలిపీఠం ఈ విధంగా సమాధానం చెప్పటం నేను విన్నాను: “ఔను ప్రభూ! సర్వశక్తి సంపన్నుడవైన ఓ దైవమా! నీ తీర్పులు సత్యసమ్మతమైనవి. న్యాయసమ్మతమైనవి.”
8 నాల్గవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించాడు. ప్రజల్ని వేడితో మాడ్చివేయటానికి సూర్యునికి అధికారమివ్వబడింది.
9 తీవ్రమైన వేడివల్ల ప్రజలు మాడిపోయారు. వాళ్ళు ఈ తెగుళ్ళ మీద అధికారమున్న దేవుని నామాన్ని దూషించారు. వాళ్ళు పశ్చాత్తాపం చెందటానికి నిరాకరించారు. ఆయన్ని స్తుతించటానికి నిరాకరించారు.
10 ఐదవ దూత తన పాత్రను మృగం యొక్క సింహాసనం మీద క్రుమ్మరించాడు. వెంటనే వాని రాజ్యం చీకటిలో మునిగి పోయింది. ప్రజలు నొప్పితో తమ నాలుకలు కొరుక్కున్నారు.
11 తమ బాధలకు, తమ కురుపులకు పరలోకంలోవున్న దేవుణ్ణి దూషించారు. కాని తాము చేసిన చెడ్డ పనులను మాని మారు మనస్సు పొందటానికి నిరాకరించారు.
12 ఆరవ దూత, తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద క్రుమ్మరించాడు. తూర్పున ఉన్న రాజులకు మార్గం సిద్ధం కావాలని ఆ నది ఎండిపోయింది.
13 ఆ తర్వాత కప్పల్లా కనిపించే అసహ్యకరమైన మూడు దయ్యాలు కనిపించాయి. అవి ఘటసర్పం నోటినుండి, మృగం నోటినుండి, దొంగ ప్రవక్త నోటినుండి బయటికి వచ్చాయి.
14 అవి భూతాత్మలు. వాటికి మహాత్కార్యాలు చేసే శక్తి ఉంది. అవి సర్వశక్తి సంపన్నుడైన దేవుని ‘మహాదినం’ నాడు జరిగే యుద్ధాని కోసం రాజుల్ని సిద్ధం చేయటానికి ప్రపంచంలోని రాజులందరి దగ్గరకి వెళ్తాయి.
15 “జాగ్రత్త! నేను దొంగలా వస్తాను. తన దుస్తులు తన దగ్గర ఉంచుకొని, మేలుకొని ఉన్నవాడు ధన్యుడు. అలా చేయకపోతే అతడు నగ్నంగా వెళ్ళి తన నగ్నతకు అవమాన పడవలసి వస్తుంది.”
16 ఆ భూతాత్మలు హీబ్రూ భాషలో ‘హర్‌మెగిద్దాను’ అనే ప్రదేశంలో రాజుల్ని సమావేశ పరిచాయి.
17 ఏడవ దూత తన పాత్రను గాలిలో క్రుమ్మరించాడు. మందిరంలో ఉన్న సింహాసనం మీదినుండి ఒక స్వరం బిగ్గరగా “సమాప్తం” అని అన్నది.
18 వెంటనే మెరుపులు మెరిసాయి. ఉరుములు, గర్జనలు వినిపించాయి. తీవ్రమైన భూకంపం వచ్చింది. మానవుడు భూమ్మీద పుట్టిననాటి నుండి అటువంటి భూకంపం ఎన్నడూ జరుగలేదు. ఆ భూకంపం అంత తీవ్రంగా ఉంది.
19 మహానగరం మూడు భాగాలుగా చీలిపోయింది. దేశాల్లో ఉన్న పట్టణాలు కూలిపోయాయి. దేవుడు బాబిలోను మహానగరాన్ని శిక్షించటం మరచిపోలేదు. దాని పాత్రలో ‘తీవ్రమైన ఉగ్రత’ అనబడే మద్యాన్ని పోసాడు. కోపంతో నిండుకొన్న ఏడు పాత్రలు
20 ద్వీపాలు, పర్వతాలు మాయమైపోయాయి.
21 ఆకాశం నుండి పెద్ద వడగండ్లు వచ్చి ప్రజలమీద పడ్డాయి. అవి ఒక్కొక్కటి అయిదేసి మణుగుల బరువు ఉన్నాయి. ఈ వడగండ్ల వాన కలిగించినందుకు ప్రజలు దేవుణ్ణి దూషించారు. ఈ వడగండ్ల వల్ల ప్రజలకు చాలా బాధ కలిగింది.

Tags:  telugu bible , bible  , prakatana  , bible telugu ,  Revelation    telugu bible , bible  , prakatana  , bible telugu ,  telugu bible , bible  , prakatana  , bible telugu ,  Revelation    telugu bible , bible  , cristian telugu bible



Choose a Bible Book or Range
Type your text here
Ignore Case
Highlight Results